ఓట్ల జాతర మొదలయ్యింది. ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు, నోట్ల కోసం ప్రజలు, చోటా మోటా నాయకులు హడావిడిగా కనిపించే కాలమిది. ప్రజా సేవలో తరించేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు . ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి, టికెట్ సాధించి, పలు వేషాలతో ప్రజల ముందుకు వచ్చారు . కులం పేరు, మతం పేరు వాడుకుంటూ ఓట్లు దండుకునేందుకు ఎగబడ్డారు . ప్రచారాలతో హోరెత్తిన్చారు . ఇంత బిజీ సమయంలో కూడా తమ వెనుక గుంపును చూపి డబ్బు దండుకునే ప్రయత్నంలో ఎందరో… కుల సంఘాలకు, వృత్తి సంఘాలకు, యువజన సంఘాలకు, మహిళా సంఘాలకు ఇలా సంఘాల వారీగా చీలిపోయి నోటుకు ఓటుకు డిమాండ్ . అంతా బిజీ బిజీ. “ఓట్ల గారడి సినిమా” అన్ని నియోజకవర్గాలలో విడుదలయ్యింది.
*అర్థం కాని సమస్యల్లా ఇక్కడే మొదలవుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా, జరిగే సహజ తంతు. అందరూ తలోపక్క పరిగెడుతుంటారు. వీడు నియంత కాబట్టి ఓడించండి. మరొకడు మతోన్మాది కాబట్టి ఎండగట్టండి. వాడు ప్రజాస్వామిక వాది కాబట్టి గెలిపించండి. పార్టీ యదేచ్ఛగా మారుతూ తెల్లారేసరికల్లా ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు అయిపోతున్నారు. ప్రజల సేవ చేయడం కోసం నాయకులు పార్టీలు బట్టలు మార్చినట్టు మారుస్తున్నారు. ఆఫీసులు ధ్వంసం చేస్తున్నారు. అప్పటివరకు నోరెత్తని వారు, ఎదుటి పార్టీ నాయకుల లోటుపాట్లను పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ మీద ఆరోపణలు ఉన్నాయి. పక్కనపెట్టి, ఇతర పార్టీల మీద వేయడం పరిపాటయింది. గెలిపించండి లేదా ఓడించండి.. అనే నినాదాలు తప్ప, ప్రజల మౌలిక డిమాండ్ల పరిష్కారం ఎవరి ఎజెండాలో ఉండడం లేదు.
ప్రజల పైన డిమాండ్లపై పోటీ చేస్తున్న అభ్యర్థుల నుండి ఎలాంటి హామీలు పొందే ప్రయత్నాలు చేయలేకపోవడం శోచనీయం. సమస్యలపై చర్చించే ఆలోచన ఎవరూ చేయడం లేదు. అదేమంటే ఇప్పటికింతే అంటూ దాటవేస్తున్నారు. అనేక సంఘాల పేర్లతో కొత్త, కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల వరకు వీరు కనిపించరు. ఇదిలా ఉంటే ఉద్యమాల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయన్న వాదం కనుమరుగైంది. తీరా గెలిచినవాడు ఏ పార్టీలో కొనసాగుతాడో ఎవరికీ తెలియదు. వాళ్లు గెలిపించిన ప్రజల ఆకాంక్షలు పట్టించుకునే నాధుడే లేడు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ ప్రక్రియ కొంత మార్పుతో ఇలాగే కొనసాగుతుంది. నాయకులకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రజల మాట వింటున్నట్లు నటిస్తారు. అందుబాటులో ఉంటున్నట్లు కనిపిస్తారు. ఇదంతా తెలిసి కూడా ప్రజల డిమాండ్లను వారి ముందు ఉంచి, నిలదీసే లేదా ప్రశ్నించే కార్యచరణ కానరావడం లేదు. ఎన్నికల సుడిగాలిలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉద్యమాల సమయంలోనే/ ఎన్నికల సమయంలోనే ప్రజల డిమాండ్ చర్చించాలి అన్న సోయిలేదు. మీడియా కూడా ఆ బాధ్యతనుండి తప్పుకున్నట్టు కనిపిస్తుంది. ప్చ్.. ప్రజలారా పారహుషార్! చైతన్యంతో మీ సమస్యల పరిష్కారం కోసం మీరే నడుం బిగించాల్సిన సమయం ఇది. సమస్యల సాధనకు ఉద్యమాలే పరిష్కారం అన్నది చరిత్ర చాటిన సత్యం!
రమణాచారి, తెలంగాణ ఉద్యమకారుడు,9989863039