భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషయరీ, మీడియా. ఈ నాలుగు స్తంభాలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్ల చేసే వ్యవస్థలు. 143 కోట్ల ప్రజల హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగ సంరక్షణకు ఆశా దీపాలు. ఎన్నికల నిర్వాహణ అనగానే దేశ ప్రజలందరికీ గుర్తొచ్చే పేరు టిఎన్ శేషన్. పౌర హక్కులు అనగానే తార్కుండే, కన్నాభిరాన్, బాలగోపాల్… ఇలా ఎందరో. మానవతావాదులు అనగానే ఎస్. ఆర్. శంకరన్, బి. డి. శర్మ,… ఇలా ఎందరో.. న్యాయాధీశుల తీర్పుల విషయానికొస్తే మనల్ని ప్రభావితం చేసే పరిపూర్ణ వ్యక్తిత్వం కలవారు కొద్దిమందే ఉంటారు. గొప్ప ఫిలాసఫర్లు,న్యాయవాదులు , జర్నలిస్టులు,మేధావులు,చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, త్యాగధనులు, విప్లవకారులు మరెందరికో జన్మనిచ్చిన నేల ఇది. వీరంతా భారత రాజ్యాంగాన్ని, చట్టాలను సరిగా అమలు చేసి ప్రజల హక్కులు కాపాడబడాలని ఆకాంక్షించినవారు. వాటి అమలుకు కృషి చేసిన వారు. వీరే గనుక సముచిత పదవుల్లో ఉండి ఉంటే, లేదా జీవించి ఉంటే పరిస్థితి ఎంత బాగుండేదో కదా! అని ఇప్పటికీ అనిపిస్తుంది. వీరంతా భారత దేశ చరిత్రలో చిరస్మరణీయులు.
ఈ సందర్భంలో గుర్తొచ్చే పేరే సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి, పద్మ విభూషణ్ పి. బి. గజేంద్రగడ్కర్. వీరి గురించి ప్రచారంలో ఉన్న ఒకానొక కథ ఆదర్శం, అనుసరణీయంగా ఉంటుందన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. అదేమంటే ఒకానొకసారి వీరి ఇంటికి ఉదయం పూట వెళ్లిన ఒక పెద్దమనిషి, గడ్కర్ గారు దినపత్రిక చదవడం గమనించాడు. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే, అది సుమారు రెండు మూడు నెలల కిందటి పాత పేపర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. సంశయం తీర్చుకునేందుకు ఇదేమిటి? ఇది ఈరోజు పేపర్ కాదు కదా! పాత పేపర్ ఎందుకు చదువుతున్నారు? అని అడిగేశాడు. గజేంద్ర గడ్కర్ గారు నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు. పాత పేపర్ చదివితే అలనాటి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అదే ఈరోజు పేపర్ చదివితే, సమకాలీన అంశాలు, నా ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దానివలన నేను ఇచ్చే తీర్పులపై ఆ ప్రభావం పడుతుందేమోనన్న ఆలోచన కారణంగా పాత దినపత్రికను చదువుతున్నాను అన్నారట. ఎంత గొప్ప విషయం ఇది. న్యాయమూర్తిగా, న్యాయస్థానంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకతీతంగా తీర్పులు రావాలనే ఆకాంక్ష కారణంగానే తమను తాము చట్టపు, చట్రంలో బిగించుకొని తీర్పులిస్తుంటారు. అందుకు ఇదొక గొప్ప ఉదాహరణ.
ఈ సమయంలో నాకు గుర్తొచ్చిన ఒక విషయాన్ని మీముందు ఉంచదలచాను. బహుశా అది 19వ శతాబ్దం సంబంధించినది. ఒకానొక అనుమానితుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అభియోగం ఏమిటంటే? తెల్లవారుఝామున నాలుగు గంటలకు రోడ్డుపై బస్టాండ్ దగ్గరలో అనుమానంగా కనిపించాడు. అతని చేతిలో ఉన్న సంచిని పరిశీలించగా, అందులో తీవ్రవాద సాహిత్యం దొరికింది. ఇది పోలీసుల అభియోగం. సదరు న్యాయమూర్తి గారు క్షణం ఆలోచించకుండా నాన్ బెయిలబుల్ గా తీర్పునిచ్చి రిమాండ్ కు పంపారు. నాలుగు రోజులు తర్వాత న్యాయవాది అతని బెయిల్ కోసం అప్పీల్ చేశారు. దానిని కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. వారం రోజులు గడిచిపోయింది. ఆ నిందితుడిని జైలు నుండి తీసుకొచ్చి తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి గారు మారడంతో కొత్తగా వచ్చిన న్యాయమూర్తి ముందుకు కేసు వచ్చింది. ఆయన గారు కేసులోని అభియోగాలకు, పోలీసుల నుండి వివరణ కోరారు. నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తి చేసిన నేరం గురించి సవివరమైన సమాచారం రాబట్టారు. దాని ప్రకారం అభియోగం మోపబడిన వ్యక్తి తెల్లవారుఝామున, సంచితో ఎటు వెలుతున్నావ్? అంటే బస్టాండ్ అని చెప్పాడు. అది ప్రయాణ సమయం కాబట్టి తప్పు ఏమీ లేదు. అతని దగ్గర దొరికిన తీవ్రవాద సాహిత్యం, ఆనాటి కాలానికి నిషేధించింది కాదు. కాబట్టి, ఇతడిని నిందితునిగా గుర్తించలేం అంటూ, కేసును కొట్టివేశారు. అభియోగం చేయబడిన వ్యక్తి ఒకరే, మోపబడిన అభియోగాలు ఒకటే. కానీ, న్యాయమూర్తులు మారడం వలన తీర్పులు వేర్వేరుగా ఉన్నాయి. న్యాయమూర్తులు అందరూ భారత శిక్షాస్మృతినే అమలు చేయాలి. కానీ, శాస్త్రీయ విశ్లేషణ, మానవీయ కోణం, పరిశీలనా విధానంలో మార్పు కారణంగా తీర్పులు వేరే విధంగా వచ్చాయని భావించక తప్పదు. ఇది సమాజంలో ఆందోళన కలిగించే విషయమే.
వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది భారత శిక్ష సంస్కృతి గొప్పతనం. రాజకీయాలకు, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించగల వారే చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచి పోతారు. ప్రలోభాలకు గురై తీర్పు ఇచ్చేవారు ప్రజల మనోఫలకాలపై దోషులుగా నిలిచిపోతారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులిస్తే, భారత న్యాయ వ్యవస్థకు, రాజ్యాంగ మూలాలకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఎటువంటి అనుమానాలకు తావుండదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించవలసిన వారు, నిత్య జాగరూకులై ఉండడం ఎంతో అవసరం. ప్రజలను ప్రేమించే వారు, వ్యవస్థను రక్షించాలి అనుకునేవారు మాత్రమే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగలరు. అప్పుడే చరిత్ర పుటలలో వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి
✍🏼 రమణాచారి, సామాజిక విశ్లేషకులు