ఆరు దశాబ్దాల ప్రజల కల. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. దశాబ్ద కాలం తర్వాత కూడా ఎజెండాగానే మిగిలింది. పునర్నిర్మాణం అంటే కోల్పోయిన వాటిని తిరిగి సాధించుకోవడం, కావలసిన వాటిని నిర్మించుకోవడం . దీనిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి విద్యా, వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక వైభవం, స్వేచ్ఛ- సౌబ్రాతృత్వం, ప్రజాస్వామిక వాతావరణం పెంపొందించే చర్యలు చేపట్టడం. స్వపరిపాలనలో ఇవన్నీ సాధించుకోగలవనే నమ్మకంతో, త్యాగాలతో నడిచిన ఉద్యమం. సుదీర్ఘకాలం, వివిధ రూపాలలో పోరాడిన చరిత్ర యావత్ తెలంగాణ ప్రజలది.
ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన / పోరాడిన ఉద్యమకారుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అమలు చేయగల రాజకీయ నాయకత్వం పునర్ నిర్మాణానికి ఎంతైనా అవసరం . త్యాగాల గాయాలతో తల్లడిల్లిన తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం పాలకుల ప్రధమ కర్తవ్యంగా ఉండాలి. పదవుల కోసం, అధికారం కోసం, సంపాదన కోసం ఎగబడుతున్న నాయకులు పునర్మాణపై శ్రద్ధ పెడతారు అనేది భ్రమగానే మిగిలిపోవచ్చు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో కొనసాగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం . ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం అనేక పాయలుగా సాగింది. ప్రధానంగా ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, బహుజన తెలంగాణ ఇలా పలుజెండాలతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమ జ్వాల అది.
✍🏻 రమణాచారి, తెలంగాణ ఉద్యమకారుడు,9989863039