చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి -రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు
మిషన్ కాకతీయ పథకం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి సీఎం కేసీఆర్ తెలంగాణలో ఉన్న చెరువులు అన్నిటిని పునర్ నిర్మించి చెరువులను బలోపేతం చేశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెరువులో మట్టిని ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే కబళిస్తున్నారని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు చింతా రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తో కలిసి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో యాద్గార్పల్లి పందిళ్ళపల్లి చెరువు, రుద్రారం చెరువు, వెంకటాద్రిపాలెం చెరువుల్లో వేలాది ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారని అన్నారు. చెరువు మట్టి ఎంతో శ్రేష్టమైనదని దీనిని రైతులు తరలించుకునే విధంగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉండగా కమర్షియల్ అవసరాలకు ఇటుక బట్టీలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.
నియోజకవర్గానికి చెందిన ఒక ప్రధాన నాయకుడు కనుసన్నల్లో ఈ అక్రమ దందా యదేచ్చగా కొనసాగుతుందని తెలిపారు. పగలు రాత్రి జెసిబి ల ద్వారా టిప్పర్లలో మట్టిని తరలించకపోతున్నారని వివరించారు. మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొద్దిగా అనుమతి తీసుకుని తీసుకున్న అనుమతులకు మించి త్రవ్వకాలు జరుపుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అక్రమ ఆర్జనలకు తెరలేపారని ఆరోపించారు. రైతుల నోట్లో మట్టి కొట్టి కమర్షియల్ అవసరాలకు చెరువు వండ్రు మట్టిని తరలించడం ఏంటని ప్రశ్నించారు. చెరువుల్లో ఇష్ట రాజ్యంగా త్రవ్వకాలు జరపడం వలన మున్ముందు చెరువులు నిండిన తర్వాత ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని ఇటువంటి గుంతలు త్రవ్వడం వలన దామరచర్ల లోని ఒక చెరువులో ఇద్దరు చిన్నారులు చనిపోయారని తెలిపారు. ఒకవైపు చెరువుల్లో అక్రమంగా మట్టి త్రవ్వకం జరుగుతుండగా మరొకవైపు చెరువు శిఖం భూములను ఆక్రమిస్తున్నారని దీనివలన చెరువు విస్తీర్ణం తగ్గిపోయి మున్ముందు చెరువుల్లో నీటి స్టోరేజీ తగ్గిపోయి భూగర్భ జలాలు తగ్గిపోతాయని దీని వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఉన్న చెరువులు అన్నిటిని అద్భుతంగా పునర్నిర్మానం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా చెరువులను కబళించి మట్టిని కమర్షియల్ అవసరాలకు తరలిస్తూ అక్రమ ఆర్జనకు కాంగ్రెస్ నాయకులు తెరలేపారని ఆరోపించారు ఇప్పటికైనా నియోజకవర్గానికి చెందిన ప్రధాన నాయకుడు ఈ అక్రమ దందాకు చెక్ పెట్టాలని లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. చెరువులో మట్టి త్రవ్వకాలు అక్రమ దందా పైన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఇసుక మాఫియా కొనసాగుతుందని ఇది కొంతమంది నాయకుల కనుసన్నల్లో యదేచ్చగా కొనసాగుతుందని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ అక్రమ దందాపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.