పార్లమెంట్ ఎన్నికలు 2024 లో ప్రజలు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దారి చూపారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఉపయోగించిన “బై బై” పదానికి ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. చిత్రంగా కనిపించినా, నిజమే కదా అనిపిస్తుంది. తెలంగాణలో బై బై కేసీఆర్, ఆంధ్రలో బై బై జగన్, దేశంలో అనేక ప్రాంతాల్లో బై బై మోడీ అనే పదాలు రాహుల్ గాంధీ నోట పలు మార్లు వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే జరిగింది కూడా అదే. యాదృచ్ఛికంగా అయినా అదే నిజమైనట్లు కనపడుతుంది. అయోధ్య పైన ఆశలు, ముస్లింల పై వ్యతిరేకత, రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగ సవరణ వంటి అంశాలు బిజెపిని ఇరకాటంలో పెట్టాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకేనేమో, ఆ పార్టీకి సింగిల్ మెజారిటీతో అధికారం పొందే సూచనలు కనుమరుగయ్యాయి. అదాని అంబానీలకు దేశ సంపదను కారు చౌకగా కట్టబెడుతున్నారనే ప్రచారం కూడా వ్యతిరేకతను పెంచింది.
అయోధ్యలో బిజెపి ఓడిపోవడం, కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారం సాధించుకుందాం అనే ఆలోచనకు గండి పడింది. రాజ్యాంగంలోని సమానత్వం, సెక్యులరిజం పదాలను తొలగస్తామనే హామీ ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారన్నది స్పష్టమైనది. పనిగట్టుకుని చేసిన ముస్లిం వ్యతిరేక ప్రచారం ఇండియా కూటమికి కలిసి వచ్చింది. వెరసి దేశంలో సంకీర్ణపాలనకు తెర లేచిందనే చెప్పాలి. దక్షిణాదిలో బలహీనపడిన ప్రాంతీయ పార్టీల స్థానాలు, బిజెపి కైవసం చేసుకోవడం జరిగింది. నిజానికి ఇది బీజేపీ బలం కాదన్నది నిర్వివాదాంశం. బీహార్ లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏర్పడబోయే ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఏర్పడింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం, బలమైన ప్రతిపక్షం ఉండడం ప్రజలకు మేలు చేసే అంశాలే. కాకపోతే ఎప్పుడే కొత్త పాలకులకు నిత్యం కత్తి మీద కత్తి మీద సాములా ఉంటుంది. ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, అందరి అభిప్రాయాలను గౌరవించడం అవసరమవుతుంది. ఒక రకంగా ప్రజాస్వామ్యానికి కొంత ఊతం ఏర్పడుతుంది. ఒక విధంగా చూస్తే ఇండియా కూటమికి అధికారం దక్కించుకునే అవకాశలు మెరుగ్గా ఉన్నాయనిపిస్తుంది. ఈ అవకాశన్ని సరిగా వినియోగించుకోగలిగితే, రాహుల్ గాంధీ రాజకీయ జీవితం ఒక మెట్టు పైకి ఎదగడానికి సహాయపడుతుంది. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి తోడవుతుంది. అధికార పీఠం కాంగ్రెస్ కు దక్కితే,ప్రస్తుత పరిస్థితులలో రాహుల్ గాంధీ ని ప్రధానిగా చెయ్యడం కాంగ్రెస్ పార్టీకి ఎంతయినా అవసరం.
ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి గనుకఅధికారం చేపడితే, కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం, ఉద్యోగాల కల్పన, లౌకిక రాజ్య ఉనికిని కాపాడడం, అదాని, అంబానీ లతో పాటు కార్పొరేట్ సంస్థల వనరుల దోపిడీని కట్టడి చేయడం, మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను అదుపు చేయడం, శాంతిభద్రతలు, ఇలా ఎన్నో ఇబ్బంది పెట్టే అంశాలు ఉన్నాయి . బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పదును పెట్టిన నిర్బంధ చట్టాలపై సమీక్ష, సవరణలు కీలకం కానున్నాయి. దేశభద్రతకు ప్రధాన సమస్య నక్సలైట్లే అన్న మన్మోహన్ సింగ్ ఆలోచనను కొత్త ప్రభుత్వం పునరాలోచిస్తుందా? మోడీలా తీవ్రతరం చేస్తుందా? అన్నది తేలాల్సి ఉన్నది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధానంగా చిదంబరం తాము తీసుకొచ్చిన నల్ల చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా ఇలాగే ఉంటాయా? అన్న మీమాంస బుద్ధి జీవుల మెదళ్లను తొలుస్తున్నది. ప్రజాస్వామ్యం పరిఢమిల్లాలని కోరుకున్న ప్రజల ఆకాంక్షకు ఈ ఎన్నికలు అద్దం పట్టాయనే చెప్పాలి. తాత్కాలికంగా జరగబోయే రాజకీయ పరిణామాలను పరిశీలించడమే తప్ప దేశప్రజల ముందు మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదు.
తెలంగాణా విషయానికొస్తే రాహుల్ గాంధీ ఇటీవల జరిపిన భారత్ జోడో యాత్రలో, వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల సందర్బంలో పౌర హక్కుల నేతలు, ఉద్యమ కారులు, బుద్ధి జీవులతో పలు అంశాలపై చర్చించారు. మరీ ప్రధానంగా తెలుగు రాష్ట్రలలో పాలకుల నిరంకుశ విధానాలపై సమాలోచలు చేసినట్లు తెలిసింది. వారంతా పాలనా విధానాలపై పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. వాటిలో అనేక అంశాలు ఇంకా ఆచరణకు నోచుకోకున్నా, పరిస్థితులలో కొంత మార్పు ఉన్నాదనే అభిప్రాయం మాత్రం ఏర్పడిందనే చెప్పాలి. స్వేచ్ఛ, స్వాతంత్ర ఆకాంక్షలు, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత నిచ్చే ప్రజలలో అసంతృప్తి మిగిలే ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను తెరిపించడం, కాలుష్య పరిశ్రమల అనుమతుల రద్దు, ఉద్యమ కారులపై అక్రమంగా మోపిన కేసులు ఎత్తివేయడం, ఉద్యోగ నియామకాలు, విద్య -వైద్యం ఉచితంగా అన్ని వర్గాలకు అందించడం, న్యాయ వ్యవస్థలో, విద్యా రంగంలో చేపట్టవలసిన సంస్కరణలు ,పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ లాంటి అంశాలు అసంపూర్ణం గా మిగిలే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనకు పాటు పడిన ఉద్యమ కారుల ఊసు లేకపోవడం నిరాశాను కలిగించే అంశం. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయకపోతే మరిన్ని ప్రజాస్వామిక ఉద్యమాలకు బలమైన పునాదులు ఏర్పడుతాయి.
రమణాచారి, తెలంగాణ ఉద్యమ కారుడు
9989863039