భిన్నత్వంలో ఏకత్వమే నవ భారతం

ఎవరి విశ్వాసాలు వారివి. రాజకీయ విశ్వాసం, మత విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించుకుంటూ వ్యవహరించడం సమంజసం. సామాజిక నిబద్ధతతో నడుచుకోవడం వ్యక్తి బాధ్యత. అనవసరంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరిని మరొకరు కించపరచుకోవడం మూఢత్వమే అవుతుంది. సభ్య సమాజంలో వీటికి తావులేదు. రాజకీయ ప్రచార, మత ప్రచార స్వేచ్ఛను రాజ్యాంగం వీలు కల్పించింది. కాకపోతే, ఒకరి ప్రార్ధనా స్థలం వద్ద అన్యమత ప్రచారం చేయడం వలన విశ్వాసాలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టే దీన్ని వ్యతిరేకించారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం వద్ద, వేరొక రాజకీయ పార్టీ పనిగట్టుకొని ప్రచారం నిర్వహిస్తే ఘర్షణలకు అవకాశం ఏర్పడుతుంది కావున అలాంటి వాటికి తావియ్యకూడదు. ఇటీవల హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో “తిరుపతి బాలాజీ బుద్ధ క్షేత్రమే” పుస్తకాన్ని ఎలా అమ్ముతున్నారని గొడవ పడి నిర్వాహకులు ( జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ ) పై, మరో విధంగా బ్రహ్మకుమారీ లపైనా దాడికి దిగడంతో మతచర్చ మరోమారు ఎజెండా పైకి వచ్చింది.

పురాతన సంప్రదాయమైన బౌద్ధశిల్పాలే బయటపడితే

బాబ్రీ మసీద్, అయోధ్య ఘటన దేశాన్ని అతాకుతలం చేసింది. మసీదు మూలాల్లో, అంటే క్రింద రామ జన్మభూమి ఆనవాళ్లు ఉన్నాయని బాబ్రీ మసీద్ ను కూల్చి వేశారు. దీనితో హిందూ- ముస్లింల మధ్య ఘర్షణగా మారింది. గౌరవ కోర్టు వారు సుదీర్ఘకాలం తర్వాత ఆ ప్రాంతంలో రామాలయం నిర్మాణానికి వీలు కల్పించడంతో అక్కడ బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది. ఇది ప్రస్తుతం మనమందరం గమనించిన విషయమే. ఇంకా చాలా ప్రాంతాల్లో హిందూ దేవాలయాల ఆనవాళ్ళ కోసం త్రవ్వకాలు చేయాలన్నది కొంతమంది హిందుత్వవాదుల ఆలోచన. కానీ, హిందుత్వ సంస్థగా ప్రచారంలో ఉన్న ఆర్.ఎస్.ఎస్. సంస్థ చీఫ్ మోహన్ భగవత్ మాత్రం తవ్వకాలు నిలిపివేయాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా తవ్వుకుంటూ పోతే, పురాతన సంప్రదాయమైన బౌద్ధశిల్పాలే బయటపడితే,కొత్త చర్చకు అవకాశం కల్పించట్లవుతుంది . తిరుపతిలో బుద్ధుడి/ జైన శిల్పాన్ని మార్చి వెంకటేశ్వరుడు( శ్రీనివాసులు, బాలాజీ)గా రూపొందించారని చారిత్రక పరిశోధకులు/ అన్వేషకులు వివరిస్తున్నారు. కె.జమన్ దాస్ 1991లో రాసిన *Thiripathi Balaji was Buddhist shrine* పుస్తకాన్ని, ఇప్పుడు తెలుగులో *తిరుపతి బాలాజీ బుద్ధ క్షేత్రమే* పేరుతో వచ్చింది. దీన్ని లాంఛనంగా ఆవిష్కరించి, ప్రారంభించిన వారం రోజులకు ఈ గొడవ జరగడంతో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గతంలో అయోధ్య లాగానే ఇప్పుడు తిరుమల తిరుపతి వైపు మళ్ళింది . నిజానికి దీనితో సామాన్య ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ, విశ్వాసాల సమస్య తెరపైకొచ్చింది. మూడు కోట్ల మంది దేవతలున్నారని చెబుతున్న హిందువులలో కూడా పూర్తి ఏకీ భావం లేదు. ఆ మాటకొస్తే శైవ క్షేత్రాల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉన్న దేశం ఇదని చెప్పక తప్పదు. అంతమాత్రాన మిగతా వాటిని తక్కువ అంచనా వేయలేం. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, షిరిడి సాయిబాబా, నరసింహస్వామి, కనకదుర్గ, మీనాక్షి, అలవేలు మంగ,వాసవి, గోదాదేవి, భద్రకాళి, ఇలా లెక్కలేనంత దేవతలను పూజించే దేశం మనదే. అదనంగా గ్రామదేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, ఉప్పలమ్మ ఇలా ఎందరో పూజనీయులు. ముస్లింలకు అల్లా, క్రైస్తవులు మేరీ మాత, ఏసుప్రభులను,సిక్కులు గురునానక్,వాహే గురు దేవతలుగా ఉన్నారు. ఇలా వివిధ ప్రాంతాల ప్రజలు, పలు మత విశ్వాసాలను కలిగి ఉన్నారు. వీరే కాకుండా ఆదివాసులు, మూలవాసులు తమ దేవుళ్లను పూజిస్తుంటారు. నాగోబా, సమ్మక్క సారలమ్మ లాంటి వారు అలాగే పూజలు అందుకుంటున్నారు. హిందువులలో అగ్రకులాలు, నిమ్న కులాలు, శూద్ర కులాలు, దళితులు, గిరిజనులు ఉన్నట్టే ముస్లింలలో సున్నీ లు, షియాలు అంటూ బేధాలున్నాయి. క్రిస్టియన్లలో కేథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అంటూ విభజింపబడి ఉన్నారు. గోండులు, కోయలు, చెంచులు, భిల్లులు, నాగాలు, కుకీలు అంటూ పలు విధాలుగా విడిపోయే జీవనం కొనసాగిస్తున్నారు.

దేశ ప్రజలందరూ ఒక్కటిగా కలిసి ఉన్నప్పుడే ప్రగతి

భారతదేశం ఒక ఉపఖండం అయినందున వివిధ సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వేష భాషలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఒకరు ఆవును పూజిస్తే, మరికొందరు కోడెలను శైవ క్షేత్రాలకు మొక్కులుగా చెల్లిస్తున్నారు. కనుమ పండగ నాడు జంతు పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారమే. దేశంలోని కాశ్మీర్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బెంగాల్ ఇలా అనేక రాష్ట్రాలలో/ ప్రాంతాలలో వివిధ భాషలు మాట్లాడుతున్నారు. హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ , సిక్కులకు ఆది గ్రంధం ఇలా ఒక్కోమతానికి ఒక్కొక్క ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. కానీ దేశ ప్రజలందరికీ ప్రామాణికమైనది మాత్రం భారత రాజ్యాంగం మాత్రమే. దేశ ప్రజల ఆహార అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు కూడా పూర్తి భిన్నంగానే ఉంటాయి. అయినా భిన్నత్వంలో ఏకత్వంలా ఒకే దేశంగా మనుగడ సాగిస్తున్నాడమే ఇక్కడి ప్రత్యేకత. ఆధిపత్యం కోసం, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే సమాజంలో కొద్దిమంది ఇలాంటి కుల,మత ఘర్షణలను సృష్టిస్తున్నారు. భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. మూఢవిశ్వాసాలను ఉసిగొల్పుతున్నారు. ఇలాంటివి భారత రాజ్యాంగంలోని లౌకిక వాదానికి, సామ్యవాదానికి గొడ్డలిపెట్టు వంటివి. దేశ అంతర్గత శాంతిని దెబ్బతీసే చర్యలు దేశ ఖ్యాతిని దెబ్బతీస్తాయి. అనేక క్రిస్టియన్, ముస్లిం అధికారం గల దేశాలకు ఉపాధి కోసం ఈ దేశం యువత వెళ్తున్నారు. అక్కడే స్థిరపడి, హాయిగా జీవనం కొనసాగిస్తూ, అక్కడి పౌరసత్వం పొంది క్షేమంగా ఉంటున్న వారికి ఇలాంటి చర్యల వల్ల ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లో మూఢనమ్మకాలతో, మూఢవిశ్వాసాలతో, మూఢభక్తితో ఒకరినొకరు కించపరచుకోవడం సరికాదు. దేశ ప్రజలందరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో ప్రజలంతా ఒక్కటిగా కలిసి ఉన్నప్పుడే ప్రగతి పథంలో ముందుకు సాగగలమని గుర్తించి నడుచుకుందాం! మనుషులుగా కలిసుందాం!! మానవత్వాన్ని ఎలుగెత్తి చాటుదాం!!!
*సర్వేజనా సుఖినోభవంతు!!!*

✍🏻 *రమణా చారి*

Spread the love