ఏమో? చూస్తుంటే ఈ అనుమానమే నిజమవుతుందా? అనే భావన ప్రజలలో ప్రబలంగా వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు ఆదేశించినట్టు హైదరాబాదు నగరంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలకు అన్ని హంగులతో ఏర్పాటు చేయడం ఒక కారణం కాగా, వైయస్ వర్ధంతి సభలో పాల్గొన్న మంత్రివర్గ సభ్యులంతా ఆయన పాలనను వేనోళ్ల కీర్తించడం రెండవ కారణం. రాష్ట్రంలో వైయస్ – బాబు తరహా పాలన ఏర్పడనుందనే అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి. చంద్రబాబు రాక సందర్భంగా హైదరాబాద్ నగరమoతటా పచ్చ తోరణాల ఏర్పాట్లు జరిగాయి. తదనంతర జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో, తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేయడమే తనలక్ష్యం అని చంద్రబాబు బాహాటంగా ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేక పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ బలపడడానికి ఇంతలా సహకరిస్తున్నది ఎవరన్నది తేలాల్సి ఉన్నది.
పెద్దమనుషుల ఒప్పందపు మూలాలు ?
తెలంగాణ ప్రజలు అరిగోస పడడాని కారణమైన పెద్దమనుషుల ఒప్పందపు మూలాలను అర్దశతాబ్ద కాలం దాటినా,ఈ ప్రాంత ప్రజలు ఇంకా మర్చిపోనే లేదు. అంతలోనే దాని రూపురేఖలు పునరావృతం అవుతున్నట్లు కనిపించడంతో తెలంగాణ ప్రజలలో ఆందోళన, ఆక్రోషo పెల్లుబికుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, విభజన హామీల / సమస్యల పరిష్కారం కోసం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసి సమావేశం ఏర్పాటు చేయమని కోరారు. సమయం, స్థలం కూడా తనే నిర్ణయించారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గం తూచా తప్పకుండా హుటాహుటిన అనుకున్న సమయానికి, హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసి గౌరవించారు. ఇది గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో చేసుకున్న పెద్ద మనుషులు ఒప్పందం అమలులోకి వచ్చిందా? అనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు ఆదేశించడం, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాకూడా, చంద్రబాబు ఆదేశాలను వెంటనే అమలు చేయడo విస్మయానికి గురించేస్తున్నది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆభర్థులను పోటీలో నిలబెట్టక పోవడం, పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు సహకరించడం కూడా కారణo కావచ్చు.అంతే కాకుండా ఒక సామాజిక వర్గం పూర్తిగా రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తునట్లు తెలుస్తుంది. అందుకేనేమో చంద్రబాబు కోరిన వెంటనే హైదరాబాద్ కు ఘనస్వాగతం పలికి కృతజ్ఞతా పూర్వకంగా గురు భక్తిని చాటుకున్నారు.చూడడానికి చిన్న విషయాలుగా కనిపిస్తున్నా, గతంలో జరిగిన ఘటనలను లోతుగా పరిశీలిస్తే అనేక విషయాలు బోధపడతాయి. బలమైన కారణాలు బహిర్గతం అవుతాయి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పాశవికంగా అణిచివేసిన వ్యక్తి చంద్రబాబు
తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసానికి కారకుడైన చంద్రబాబు. రాష్ట్రంలో ఆట-పాట-మాట బందు పెట్టి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పాశవికంగా అణిచివేసిన వ్యక్తి. గద్దర్ పై కాల్పులు, బెల్లి లలిత పాశవిక హత్య, మారోజు వీరన్న తది తరులను బూటకపు ఎన్కౌంటర్లు చంద్రబాబు హయాంలోనే జరిగాయి.చర్చల తంతు పేరిట మోసంచేసి అతి కిరాతకంగా ఎన్కౌంటర్ ల పేరున తెలుగునేలలో రక్తపుటేరులు పారించించిన చరిత్ర వై. ఎస్. ది. ఆనే ఆరోపణలో నిజమావున్దేగా ! ఇదిలా ఉంచితే గతంలో చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉండి తెలుగుదేశం అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ( ప్రస్తుతo రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ) గెలుపు కోసం చేసిన ప్రయత్నంలో, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకేనేమో ? అంతటి దుర్మార్గ పాలనను కొనసాగించిన వ్యక్తిని, రేవంత్ రెడ్డి ఏనాడు విమర్శించలేదు. సరి కదా 18 గంటలు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడని పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి బిజెపితో జత కట్టిన, తెలుగుదేశం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం పలు అనుమానాలకు తావివ్వడం సహజం. పోలవరం ముంపు గ్రామాల సమస్య అలాగే ఉండిపోయింది. గిరిజనుల పొడుభూముల సమస్య, నిర్వాసిత్వ సమస్య కొలిక్కి రాలేదు. ప్రజల మౌలిక సమస్యలను పక్కన పెట్టి ప్రత్యేక పారా మిలటరీ బలగాలను భద్రాచలం,ములుగు ఏజెన్సీలకు కోరడమంటే ఆదివాసీల పైన, వారి భూముల పైన, వనరుల పైన కన్నేయడమే. బహుళ జాతి సంస్థలకు అప్పగించాలనే ఆలోచనలో భాగమే. ఆ ప్రాంత ప్రజల జీవనం స్థితిగతులు అభివృద్ధి చేయాలనే ప్రణాళికను పక్కనపెట్టి, విస్తారమైన రహదారుల నిర్మాణం, విమానాశ్రయాల ఏర్పాటు ఆదివాసి జీవితాలను ధ్వంసం చేసే ప్రక్రియ కాగలదు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా- వాగ్దానాలన్నీ ప్రెస్ మీట్ల నివేదికలుగా…
బయటకు కాంగ్రెస్ పార్టీ పాలనగా కనిపిస్తున్నా , అంతర్గతంగా చంద్రబాబు విధానాలను, అమలు చేయాలనే ఆలోచనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ప్రచారమౌతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ సొంతం. దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే దూరా(దురా)లోచనలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అలాగే ఉంది. ఉచిత విద్య వైద్యం పైన ఎలాంటి ప్రణాళికా రచన జరుగుతున్నట్లు కానరావడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ జరగలేదు. యూనివర్సిటీల బలోపేతానికి సరైన నిధులు కేటాయించి భౌతిక వనరులతో పాటు, అధ్యాపకులను నియమించాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య బలోపేతానికి అవసరమైనన్ని నిధులను కేటాయించాలి. చైనా ( చైతన్య -నారాయణ )వంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ఆగడాలకు అదుపు లేదు. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. కౌలు రైతుల సమస్య నానుతూనే ఉన్నది. ఓపెన్ కాస్ట్ మైన్లు, నీటి ప్రాజెక్టులు, థర్మల్ ప్రాజెక్టులు, రింగు రోడ్లు, రోడ్ల విస్తరణ తదితర అంశాలతో ముడిపడి ఉన్న నిర్వాసిత్వ సమస్య నానాటికి పెరుగుతున్నది. మూతపడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను తెరిపించే ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి. సింగరేణి గనుల అమ్మివేయాలనే కేంద్ర ప్రతిపాదనలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం కాలేదు. భూగర్భ గనుల ఏర్పాటు విషయంలో ఆసక్తి చూపి, ఆ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. పర్సెంటేజీల కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేందుకు ప్రణాళికా రచన జరుగుతున్నట్లు తోస్తున్నది. ఎన్నికల వాగ్దానాలన్నీ ప్రెస్ మీట్ల ముందు నివేదికలుగా మాత్రమే మారుతున్నాయి.
చంద్రబాబు , వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ హక్కులను కాల రాసిన వారే
చిత్రమైన విషయం ఏమంటే? చంద్రబాబు , వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ ప్రజల హక్కులను కాల రాసిన వారే. నిర్బంధాన్ని అమలుచేసి, ఉద్యమకారుల రక్తంతో ఈ నేలను తడిపిన వారే. సహజ వనరులను యదేచ్చగా దోచుకున్న వారే. ఈ ప్రాంతాన్ని ప్రజల భాష, యాసలను అవహేళన చేసిన వారే. తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరచినవారే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్నిఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించిన వారే. పౌర ప్రజాస్వామ్య హక్కులను కాలరాసిన వారే. ఆత్మగౌరవం కోసం, వనరుల పరిరక్షణ కోసం, స్వపరిపాలన కోసం దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగాయి. చంద్రబాబు, వై.యస్. లు ఉద్యమాలను అణిచివేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. ప్రజా ఉద్యమాల ఫలితంగా స్వరాష్ట్రం సాకారం అయ్యింది. స్వరాష్ట్రంలో తొలిసారిగా తె. రా. స. కు అధికారం కట్టబెట్టారు. ప్రజారoజక పాలన సాగడం లేదని భావించి ఆ పార్టీని తిరస్కరించి, ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. కానీ,అనతి కాలంలోనే ప్రజల ఆకాంకంక్షాలకు అనుగుణంగా పాలన సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో సీమాంధ్ర పాలకుల, పాలనా భజన అవసరం ఎందుకు వచ్చిందో? తేటతెల్లం చేయాల్సి ఉంది.
వైయస్ – బాబుల పాలనకు బీజాలు పడుతున్నాయా?
ప్రస్తుత తెలంగాణాలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే రాష్ట్రంలో వైయస్ – బాబుల పాలనకు బీజాలు పడుతున్నాయా? అనే అనుమానాలు ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారుల, బుద్ధి జీవుల మెదళ్ళను తొలుస్తున్నాయి . రాష్ట్రంలోఅసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రజలకు హామీ ఇచ్చినట్లు,రాష్ట్రంలో ప్రజాస్వామ్యo పరిఢమిల్లుతుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయి . యావత్ తెలంగాణ సమాజం అనేక ఆశలతో కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టిన అధికారం, దీర్ఘకాలం నిలబడాలని ఆ పార్టీ అధిష్టానం కోరుకుంటున్నదా? అయితే అధినాయకత్వం చొరవ చూపి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సమీక్ష చేసుకొని, గత పాలనకు భిన్నంగా ముందుకు సాగేలా చొరవ చూపాలి. తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో సమతుల్య మైన అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. పరిపాలనా పద్ధతిని మార్చుకోకుండా, పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలంగాణలో ప్రజల ఆకాంక్షల సాధనా ఉద్యమం మళ్లీ పురుడు పోసుకోవడం అనివార్యంగా కనిపిస్తుంది.
✍🏻 రమణా చారి,తెలంగాణ ఉద్యమకారుడు